జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్
ఎల్.కోట :
విజయనగరం జిల్లా. ఎల్.కోట మండలం, గంగుబూడి గ్రామంలో శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి గారి ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ముఖ్య అతిధిగా హాజరై, విదార్ధిని, విధ్యార్ధులు, తల్లితండ్రులు, ప్రజలతో మమేకమయ్యారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం నిర్వాహకులు జిల్లా ఎస్పీ కి సాదరంగా స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మాట్లాడుతూ – విద్యార్థులు చిన్నప్పటినుంచే లక్ష్యాలను నిర్దేసించుకొని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని తెలిపారు.
ఇటీవల విడుదలైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం, గంగుబూడి గ్రామానికి చెందిన బాలికలు కుమారి వై.ఉమా పార్వతి పదవ తరగతి ఫలితాలలో 594 మార్కులు, అదేవిధంగా కుమారి కొసురు పూర్ణిమ ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో 464 మార్కులు సాధించి జిల్లాలో ప్రధమ స్థానాలలో నిలిచి తమ తల్లితండ్రులకు, గురువులకు, ఊరికి, పాఠశాలకు మరియు విజయనగరం జిల్లాకు మంచి పేరు తెచ్చారని, మిగతా విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచారని జిల్లా ఎస్పీ తెలిపారు. పల్లెటూరులో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని జిల్లాలో ప్రధమ స్థానం సాధించటం నిజంగా ఒక గొప్ప విషయం అని జిల్లా ఎస్పీ కొనియాడారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విదార్ధులు ప్రైవేటు పాఠశాల విదార్దులతో పోటీ పడే స్థాయికి చేరుకున్నారని, ఇది మంచి పరిణామమని జిల్లా ఎస్పీ తెలిపారు. విదార్ధులు చదువుతోపాటు సాంకేతికంగా వచ్చే మార్పులను గమనిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా భోగాపురంలో విమానాశ్రయం వస్తుందని, మనకి దగ్గరలో గూగుల్ డేటా సెంటర్ కూడా వస్తుందని తెలిపారు. విద్యార్ధులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకొని, తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి, మంచి విజయాలను సాధించి తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి గారు ప్రజలకు అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ కొనియాడారు.
మహిళలు మరియు పిల్లల రక్షణ, భద్రతకు జిల్లా పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, ఇందులో భాగంగా జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపదుతున్నామని తెలిపారు. ఆపద సమయాల్లో తమ స్వీయ రక్షణకు ఆత్మరక్షణ మెళుకువలు విద్యార్ధినులకు నేర్పించడం, వారికి రక్షణగా ఉండే చట్టాలు పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. చదువుకొనే సమయంలో విద్యార్థులు చెడు మార్గంలో పయనించకుండా లక్ష్య సాధన వైపు నడవాలన్నారు. యువత గంజాయి జోలికి పోవద్దని, గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు సమాచారం అందించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ ద్విచక్ర వాహనంపై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, “అమ్మ జన్మనిస్తే – హెల్మెట్ పునర్జన్మని ఇస్తుందని” జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఏ అపాయం వచ్చినా డయల్ 100/112 ఫోన్ చేసి, పోలీసులు సహాయం పొందవచ్చునని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు.అనంతరం జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన కుమారి వై.ఉమా పార్వతి మరియు కుమారి కొసురు పూర్ణిమలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు సన్మానించి, మేమోంటోలు అందచేసారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్ఐ రామకృష్ణ, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!