విజయనగరం, మే 20: విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కమాండెంట్ వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 191 మంది SCTPC (Stipendiary Cadet Trainee Police Constable) శిక్షణార్థులకు నాలుగు రోజుల పాటు అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. బి. దేవి మాధవి తెలిపారు.పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణలో ప్రమాదాలు, గుండెపోటు, మునిగిపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, అలాంటి సందర్భాలలో తక్షణ వైద్య సహాయం అందించగల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS), అత్యవసర చికిత్స విధానాలు, గాయపడిన వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అందించే పద్ధతులు, గుండెపోటు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, శ్వాస ఆడకపోతే చేయవలసిన సహాయక చర్యలపై శిక్షణ అందించబడిందన్నారు.ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో డమ్మీ మానికిన్స్ (Mannequins) సహాయంతో ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించబడిందని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న పోలీస్ శిక్షణార్థులు అత్యంత ఆసక్తి కనబరిచారని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ డా. బి. దేవి మాధవి పేర్కొన్నారు.