హైదరాబాద్, మే 11:

  ప్రముఖ ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థ   ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ 3డి ఎక్స్పీరియన్స్  ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించింది.  ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థ డసాల్ట్ సిస్టమ్స్‌తో కలిసి తమ ఉత్పత్తి అభివృద్ధి వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు  ఈ ప్లాట్‌ఫామ్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సమగ్ర డిజిటల్ ఉత్పత్తి అభివృద్ధి వ్యవస్థను నిర్మించేందుకు ఓలెక్ట్రా కీలక అడుగు వేసినట్లయింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో వేగవంతమైన ఆవిష్కరణలకు ఆధునిక డిజిటల్ సాంకేతికత  అవసరాన్ని  గుర్తించిన ఓలెక్ట్రా, ఈ నిర్ణయం ద్వారా తమ ఇంజనీరింగ్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఓలెక్ట్రాకు ఉన్న నాయకత్వం, వర్చువల్ ట్విన్ టెక్నాలజీ, ప్లాట్‌ఫామ్ ఆధారిత ఇంజనీరింగ్‌లో డసాల్ట్ సిస్టమ్స్‌కు ఉన్న నైపుణ్యం కలిసిరానుంది. దీని ద్వారా , భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ విధానాలను కొత్త స్థాయికి వెళ్లనున్నాయి.3డి ఎక్స్పీరియన్స్  ప్లాట్ఫారం  ద్వారా సిబ్బంది, డేటా, డిజైన్, సిమ్యులేషన్, తయారీ ప్రక్రియలన్నీ ఒకే సమగ్ర వేదికపై అనుసంధానమవుతాయి. దీని ద్వారా బస్సు ఉత్పత్తి ప్రారంభ దశ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే వరకు  పర్యవేక్షణకు అవకాశం కలుగుతుంది. దీంతో ఓలెక్ట్రా సంప్రదాయ పద్ధతుల నుంచి మోడల్ ఆధారిత, ప్లాట్‌ఫామ్ ఆధారిత ఉత్పత్తి అభివృద్ధి విధానానికి మారి  ప్రపంచ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు అనుసరిస్తున్న ప్రమాణాలకు చేరువైంది. ఈ భాగస్వామ్యంతో ఓలెక్ట్రాకు పూర్తిస్థాయి డిజిటల్ ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యం లభించనుంది. ఇంజనీరింగ్, తయారీ విభాగాలు, సరఫరాదారులు ,  ఇతర భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయం మరింత సులభతరం అవుతుంది. భౌతిక నమూనాలను తయారు చేయకముందే వర్చువల్ సిమ్యులేషన్  వాలిడేషన్ ద్వారా ఉత్పత్తులను పరీక్షించే అవకాశం ఉంటుంది. తద్వారా ఆవిష్కరణల వేగం  పెరగడం, మార్కెట్లోకి ఉత్పత్తులను త్వరగా తీసుకురావడం, భవిష్యత్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లను పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది.

ఈ సందర్భంగా ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ, “మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిఫికేషన్, డిజిటల్ ఇంజనీరింగ్ ద్వారానే రూపుదిద్దుకుంటుందని మేము నమ్ముతున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండే వినూత్న పరిష్కారాల ద్వారా రవాణా రంగంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త బస్సులు, ట్రక్ ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. డసాల్ట్ సిస్టమ్స్‌తో  3డి ఎక్స్పీరియన్స్  భాగస్వామ్యం  , ప్లాట్‌ఫామ్ స్వీకరణ ద్వారా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా, తెలివిగా, అత్యుత్తమ నాణ్యతతో ఉత్పత్తులను రూపొందించే సామర్థ్యం మాకు లభిస్తుంది. భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల దిశగా వేగంగా ముందుకెళ్తున్న ఈ సమయంలో మేము వినియోగంలోనే కాకుండా ఇంజనీరింగ్ ప్రతిభలో కూడా ముందంజలో ఉండేందుకు కట్టుబడి ఉన్నాం” అన్నారు.డసాల్ట్ సిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ ఎన్‌జీ మాట్లాడుతూ, “భవిష్యత్ మొబిలిటీ ముందుగా వర్చువల్ ప్రపంచంలో రూపుదిద్దుకుని తరువాత రోడ్లపైకి వస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఓలెక్ట్రాతో మా భాగస్వామ్యం సమగ్ర, ప్లాట్‌ఫామ్ ఆధారిత ఆవిష్కరణలకు దారితీసే ముందుచూపు నిర్ణయం. దీని ద్వారా వేగవంతమైన, తెలివైన, పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి సాధ్యమవుతుంది. వర్చువల్ ట్విన్ అనుభవాలు ,  తదుపరి తరం ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా భారత మొబిలిటీ రంగ రూపాంతరానికి మేము తోడ్పడతాం” అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆటోమొబైల్ మరియు మొబిలిటీ సంస్థలు ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఆధారిత ఇంజనీరింగ్  పద్దతులను స్వీకరిస్తూ అభివృద్ధి ప్రక్రియను ప్రమాణీకరించడంతో పాటు క్లిష్టతను తగ్గిస్తూ, తదుపరి తరం వాహన నిర్మాణాలకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓలెక్ట్రా,  డసాల్ట్ సిస్టమ్స్ భాగస్వామ్యం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే కీలక పరిణామంగా  చెప్పవచ్చు. 3డి ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌ను తమ ఇంజనీరింగ్ వ్యవస్థలో కేంద్రంగా అమలు చేయడం ద్వారా ఓలెక్ట్రా తన డిజిటల్ సామర్థ్యాలను మరింత పెంపొందించుకొని, ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన, ఇంజనీరింగ్, తయారీ  మార్కెటింగ్ రంగాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది