విశాఖపట్నం మే 18:- మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో13,597 మందికి 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేసిందని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవ కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ జి .విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ యాదవ్, కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేట నిషేధభృతి కింద మత్స్యకారులకు జిల్లాలో 27 కోట్ల 19 లక్షల 40 వేలు మెగా చెక్కును అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం వేట నిషేధ భృతి కింద కుటుంబానికి 20వేల వంతున విడుదల చేసింది అన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 1500 మంది లబ్ధిదారులను చేర్చినట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు మెకానైస్డ్ బోట్లలో పనిచేసే సిబ్బంది 6గురికి మాత్రమే జీవన భృతి వర్తించగా ప్రస్తుతం 8 నుండి 10 మంది వరకు ఈ పథకంలో చేరుస్తున్నామన్నారు. ఇంకెవరైనా మిగిలి ఉంటే వారిని కూడా గుర్తించి ఈ పథకంలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
 ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మణరావు, మత్స్యకార బోట్ల ఓనర్లు, మత్స్యకారులు పాల్గొన్నారు.