--విజయవాడ, విశాఖల్లో త్వరలో అమలు
--మధ్యాహ్న భోజన పథకానికి స్టీమ్ బియ్యం
--మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
న్యూ ఢిల్లీ :
రేషన్ పంపిణీకి గుజరాత్‌లో అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాడ్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని త్వరలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో అమల్లోకి తేనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన మంగళవారం దిల్లీలో తమ శాఖ సమస్యలపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషితోపాటు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం ఏపీభవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘చౌకధరల దుకాణాల ద్వారా అందించే బియ్యం, పంచదారలాంటి వస్తువులను గుజరాత్ తరహాలోనే మేం కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా అందిస్తామని కేంద్ర మంత్రికి చెబితే సానుకూలంగా స్పందించారు. ఈ కొత్త విధానం కింద ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ వ్యాలెట్ ప్రారంభిస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్రంలోని 41 వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టళ్లకు అందిస్తున్న సన్న బియ్యం స్థానంలో ఈ ఏడాది నుంచి నాణ్యమైన స్టీమ్ బియ్యం అందించాలనుకుంటున్నామని చెప్పగా కేంద్ర మంత్రి అంగీకరించారు. రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో 2 లక్షల టన్నుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మరో రెండు లక్షల టన్నుల అదనపు సేకరణకు కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. వినియోగదారులకు తక్కువ ధరలకే సరకులు అందించేందుకు రాష్ట్రంలో వెయ్యి మినీమార్టులు ఏర్పాటు చేయడానికి, దేశంలోని అన్ని మిలిటరీ క్యాంటీన్లలో అరకు కాఫీ విక్రయించేందుకు నేషనల్ సెంట్రల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్‌సీసీఎఫ్) అంగీకరించింది. చమురుసంస్థలు, పౌరసరఫరాల శాఖ మధ్య సమాచారలోపం కారణంగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్, ఎల్‌పీజీ కొరత వచ్చిందంటూ కేంద్ర పెట్రోలియం శాఖకు నివేదించాం’అని మనోహర్ చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు.
ఏమిటీ సీడీబీసీ?
కేంద్రం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సబ్సిడీ రూపంలో అందిస్తున్న మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన డిజిటల్ రూపాయి రూపంలో లబ్ధిదారుల ఖాతాలకు పంపుతుంది. బియ్యం, పంచదార, ఇతర వస్తువులపై అర్హులైన కుటుంబాలకు నెలవారీగా అందించే సబ్సిడీ మొత్తాన్ని.. రేషన్‌కార్డులతో అనుసంధానమైన ఫోన్లలో డిజిటల్ వ్యాలెట్లు ఏర్పాటు చేసి, దానిలో జమ చేస్తుంది. దీంతో ఆ రేషన్ దుకాణంలో లభించే ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు. బయోమెట్రిక్స్ వేయాల్సిన అవసరం ఉండదు. లావాదేవీల వేగం పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి తమకు ప్రతి నెలా ఎంత సబ్సిడీ అందుతుందో వినియోగదారులకు స్పష్టంగా తెలుస్తుంది. రేషన్ డీలర్లకు మార్జిన్లూ రియల్‌టైమ్‌లో అందుతాయి.
మొదటి వ్యాఖ్య రాయండి!