తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ పెరిగింది. దీంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్‌లు నిండిపోయి రింగ్ రోడ్‌లోని గోగర్భం డ్యాం వరకు వేచి ఉన్నారు. దాదాపు 3 కిలోమీటర్లు క్యూలైన్‌లో బారులు తీరారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం వేగంగా చేయిస్తున్నారు. క్యూలైన్‌లో భక్తులకు తాగు నీరు, పాలు, అన్న ప్రసాదాలు.. శ్రీవారి సేవకుల సాయంతో అందిస్తున్నారు.